15, జూన్ 2026, సోమవారం
వానచేవ
10, జూన్ 2026, బుధవారం
ఎవరు దిక్కు?
అయ్యా!
నీటితీగ
నింగి నుంచి సాగెనొక్క నీటితీగ నేరుగా
భంగమంచు నేదిలేక పల్లముండు వైపుగా
రంగు చిక్కనయ్యె నేల రమ్యమైన తోటయై,
పొంగులెత్తె సౌరభమ్ము పూల మించుచున్నదై.
19, మార్చి 2026, గురువారం
సామ్రాట్టుకు స్వాగతమ్!
జలజల రాలిన యాకుల
లలి మరపించుచు వినూత్న లావణ్యముతో
పలుపలు సొబగులఁ గూర్చుచు
వలువల తీరై మెరిసిన పత్రిం గనరే!
యాకుల మాటుగా మెరిసి, హ్లాదముఁ గూర్చెడు వన్నెచిన్నెల
న్చీకటి రేయిలో విరియు చిన్ని సుమమ్ములఁ జూడ నేర్చిన,
న్చీకులు చింతలే పగిదిఁ జిత్తముఁ జేరును చెప్పవోయి, యీ
లోకము సుందరమ్మనక లోపములేటికి యెంచనెంచితో!
తొలిరాగమ్ములఁ గమ్మగాఁ బలుకుచున్దొల్దొల్త నా కోకిలల్
తెలిరాగమ్ముల సాంద్రవర్ణముల దేదీప్యమ్ముగా పుష్పముల్
వలరాజొక్కడు మిత్రుడై చెలగునా వాసంతసామ్రాట్టుకై
యిలలో స్వాగత సత్కృతుల్ సలుపరే యింతింతకంతింతలై!
27, జూన్ 2025, శుక్రవారం
రథయాత్ర
-లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము
16, మే 2025, శుక్రవారం
వీరులు
గుప్పెడు దేశభక్తిఁ గడు క్రూరపు పాలనఁ ద్రుంచగల్గుట
న్ముప్పగు పీడనమ్ముల విమోచనమందగఁ గోరి, వీరత
న్తప్పులఁ జేయు ధూర్తతను ధ్వంసముఁ జేయుట, పారఁ ద్రోలుట
న్గొప్పగఁ జెప్పుకుందు పదికోటుల మారులు గౌరవమ్ముతో.
-లక్ష్మీదేవి
ఉత్పలమాల
2, మే 2025, శుక్రవారం
శంకరజయంతి
26, మార్చి 2025, బుధవారం
జననికి
ఒడి సింహాసనమై కరమ్ము గొడుగై యుప్పొంగు సౌభాగ్యమై
సడి సేయంగ నివాసమెల్ల వెలుగై సంతోషముల్దండియై
కడు పుణ్యమ్ముల పంటయై జననికే గారంపు బంగారమై
ముడి పువ్వే నెమలీకయై యలరెనీ బుజ్జాయి శ్రీకృష్ణుడై.
- లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము.
13, జనవరి 2025, సోమవారం
చలిగాలులు
పులకింతల కదలాడుచు మురిపించెడు తరువు
ల్తిలకింపగ కనువిందుగ దివియో నిది యనగా
తలపొక్కటి మదిలోపల దరహాసమునిడెనోయ్.
21, జులై 2024, ఆదివారం
జోతలు
పలుకు, పదములందు పట్టునిచ్చినవారు,
సుఖము, శాంతి, కొరత, శోకమెల్ల
నదనుఁజూచి కూర్చి, పదనుఁదీర్చినవార
కెల్ల జోతలిడుదు నిందునెందు.
-ఆటవెలది.
లక్ష్మీదేవి.
10, ఆగస్టు 2023, గురువారం
జలద వృత్తము
వానలు మెండుగా కురియఁ, బావనమౌ
కానలు నిండుగా పెరుగ కారణమౌ.
కానల దండిగా నిలిపి కాచినచో,
వానలకండయై పిలుచు పైడి యగున్.
- లక్ష్మీదేవి.
జలదము
11, నవంబర్ 2022, శుక్రవారం
కొత్త వృత్తము
పుస్తకమ్ములందొక్కటైన నేఁ బూర్తిచేయగా జన్మచాలునా?
మస్తకమ్మునన్నిల్చియుండగా మర్మమైనదౌ యర్థమందునా?
విస్తరమ్ముగా నెల్ల రీతులన్ విద్య సంపదై నాకు దక్కునా?
అస్తమించుచో జీవనమ్ము, నీ యాత్మతృప్తిగా నిష్క్రమించునా?
--లక్ష్మీదేవి
9, నవంబర్ 2022, బుధవారం
లయగ్రాహి
మాలి యొకడుండెనట, పూలతలఁబెంచెనట, మేలి విధ గంధములు గాలులను నిండెన్.
కేలఁగొని యల్లుకొని మాలలుగ కూర్చుకొని కాలినడ కోవెలకు మాలి చనె భక్తిన్.బాలలును పెద్దలును వేలుపుల పూజలనుఁ గోలములనాడిరట, చాల కనువిందుల్.
రాలినవి పూలచట తేలినవి వాగునల సోలినవి వాడినవి చాలునట జన్మల్.
14, అక్టోబర్ 2022, శుక్రవారం
పొంగారు
ప్రాలేయాంశువు రాకతోసుఖముగా రాజిల్లు విశ్వమ్ము, నా
నీలాకాశముతోడ పృథ్వి భళిగా నిండార వెల్గొందె, నే
లీలామాత్రపు గాలి సోకినదొ, యీ లేతాకులల్లాడెనే!
యీ లావణ్యములందు సోలు మది, తా,నింపైన రాగమ్ములో .
--లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
25, ఆగస్టు 2022, గురువారం
జిజ్ఞాసువునై
పవమానాదృతమైన యాకులను, పుష్పాలంకృతంబౌ మహీ
భవమందైనను, రాతి భూధరపు నిర్వ్యాపార సత్త్వమ్ములన్,కవనావేశపు లేఖనమ్ములను, సత్కావ్యంపు వ్యాఖ్యానమున్,
శివగామీ! నినునెల్లచోటులను నేఁ జేరంగఁ యత్నింపనే?
11, ఫిబ్రవరి 2022, శుక్రవారం
ఏమో మరి!
వైద్యుల (అల్లోపతీయే) దగ్గరకు ఏ జ్వరానికో, కడుపునొప్పి కో ఇలా చిన్నవాటికి దేనికి వెళ్ళినా రక్తం అదే హిమోగ్లోబిన్ తగినంత ఉందా లేదాని కనీసం కళ్ళు, గోళ్ళు, నాలుక పరీక్ష చేసేవారు. అవి కొద్దిగా ఎఱుపురంగులో ఉంటే ఫర్వాలేదు, ఉందని నిర్ధారించేవారు, స్టెతస్కోపుతో గుండెగతి, నాడి అదే పల్స్ పరీక్షించాకే మిగతా వివరాలు వినేవారు. కాలక్రమంలో అన్నీ మానేశారు. రక్తపరీక్షకు పంపడమే. కోవిడ్ లో ఉంటేనే పల్స్, హార్ట్ బీట్ చూడాలనడం ఇప్పుడొచ్చింది.
ఇవన్నీ ఎందుకు వదిలేశారో! అది అల్లోపతికి కూడా ముఖ్యమే కదా!
पाणिपादतले रक्ते नेत्रान्तौ च नखास्तथा।
तालु-जिह्वा-अधरोष्ठं च सप्तरक्तः सुखी भवेत्॥
-- महाभाग्यलक्षणानि।
పాణిపాదతలే రక్తే నేత్రాంతౌ చ నఖాస్తథా।
తాలు-జిహ్వా-అధరోష్ఠం చ సప్తరక్తః సుఖీభవేత్॥
--మహాభాగ్యలక్షణాలు.
అని ప్రాచీనోక్తి.
అరచేతులు, అరికాళ్ళు, కంటి చివరలు, గోళ్ళు, దవడ, నాలుక, క్రింది పెదవి ఈ ఏడింట ఎఱుపురంగు ఉన్నవాళ్ళు సుఖపడతారు. ఏడు కాకున్నా మూడు చూసేవారు.
ఆరోగ్యమే కదా మహాభాగ్యం.
13, డిసెంబర్ 2021, సోమవారం
పోతన సందేహం
బాల్యములో పోతన తన తల్లిదండ్రులతో నాటకం గురించి సందేహాలనడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం, అందులోని తాత్వికతను లౌకికముగా కానదగిన విషయసమాచారంతో నిరూపించి చెప్పడం సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్య విరచిత 'పోతన చరిత్రము' కావ్యములో ఒకానొక (కల్పితమైన ?) చక్కటి సన్నివేశము.
-
"వస్తూ పోతూ ఉన్నారేం ఈ నటులు లోపలికి?"
"చస్తూ పుడుతూ జనులు భూమిలో ఉండడం లేదూ అలాగే."
"ఎక్కడికి వెళ్తున్నారలా?" "ఎవడు వారికీ వేషం కట్టి
పంపాడో ఆ సూత్రధారి దగ్గరకే"
" అలా వెళ్ళిన వారిని చూసి అతడేమంటాడు?"
" వారి వేషాలను ఎలా ఆడిపాడమని చెప్పాడో అలా
చేస్తే ఆహా అని మెచ్చి మరిన్ని మంచి భోగాలనిచ్చి చేయనివారిని
పొండని దండన చేస్తాడు"
-
ఇలా సాగుతుంది.
అందమైన పద్యాలు, చక్కటి ధార, సన్నివేశకల్పన, సహజవర్ణన.
--
పరిచయం చేసిన సన్మిత్రుల పట్ల కృతజ్ఞురాలను.
8, అక్టోబర్ 2021, శుక్రవారం
ముద్రాలంకారవృత్తము
24, మే 2021, సోమవారం
సాగుభూమి-మబ్బుల విహారం