10, జూన్ 2026, బుధవారం
ఎవరు దిక్కు?
అయ్యా!
19, మార్చి 2026, గురువారం
సామ్రాట్టుకు స్వాగతమ్!
జలజల రాలిన యాకుల
లలి మరపించుచు వినూత్న లావణ్యముతో
పలుపలు సొబగులఁ గూర్చుచు
వలువల తీరై మెరిసిన పత్రిం గనరే!
యాకుల మాటుగా మెరిసి, హ్లాదముఁ గూర్చెడు వన్నెచిన్నెల
న్చీకటి రేయిలో విరియు చిన్ని సుమమ్ములఁ జూడ నేర్చిన,
న్చీకులు చింతలే పగిదిఁ జిత్తముఁ జేరును చెప్పవోయి, యీ
లోకము సుందరమ్మనక లోపములేటికి యెంచనెంచితో!
తొలిరాగమ్ములఁ గమ్మగాఁ బలుకుచున్దొల్దొల్త నా కోకిలల్
తెలిరాగమ్ముల సాంద్రవర్ణముల దేదీప్యమ్ముగా పుష్పముల్
వలరాజొక్కడు మిత్రుడై చెలగునా వాసంతసామ్రాట్టుకై
యిలలో స్వాగత సత్కృతుల్ సలుపరే యింతింతకంతింతలై!
27, ఫిబ్రవరి 2026, శుక్రవారం
కన్యాకుమారి
🙏 కన్యాకుమారి 🙏
23, జనవరి 2026, శుక్రవారం
తల్లీ!
తల్లీ! విద్యనొసంగి యధ్యయనమున్తాదాత్మ్యమున్నిండుగా
నుల్లమ్మందున నింపి నన్ను నిక నీవుద్ధారణన్జేయుమా!
ముల్లోకమ్ముల రక్షవై నిలిచి నిర్మోహమ్ము నెట్లుందువో
తల్లీ! నమ్మితి భారతీ! భగవతీ! త్రైగుణ్య విద్యానిధీ!
21, జనవరి 2026, బుధవారం
దీపం
-- లక్ష్మీదేవి
ఆటవెలది
18, నవంబర్ 2025, మంగళవారం
కాలం!
నీలపు రాత్రులంబొదిగి స్నిగ్ధసువర్ణ దినాళులందు ను
న్మీలిత నేత్ర! నిభ్భువిని మేలిమి యన్నులమిన్నఁ జేసి, మ
మ్మేలితి! చిత్రమేమనగ హృద్యమ ప్రాకృత దృశ్యవీక్షణా
లాలసఁగోలుపోయినది లౌకికజీవనమేమి కాలమో!
19, జులై 2025, శనివారం
నీలోత్పల
నీలిమ వర్ణమై పరవి నింగిని నిండితి నిర్మలమ్ముగా
నీలిమ వర్ణమై కనుల నిల్చితి నిట్టులె నిశ్చలమ్ముగా
నీలిమ వర్ణమై కదలు నీరధిఁ దేలి మరింత మక్కువ
న్నీలిమ వర్ణమై మెరిసి నీ దరిఁ జేరితి నీలమాధవా!
-లక్ష్మీదేవి
నీలోత్పలమాల
నీలమాధవుడని జగన్నాథునికి పేరు.
27, జూన్ 2025, శుక్రవారం
రథయాత్ర
-లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము
26, మార్చి 2025, బుధవారం
జననికి
ఒడి సింహాసనమై కరమ్ము గొడుగై యుప్పొంగు సౌభాగ్యమై
సడి సేయంగ నివాసమెల్ల వెలుగై సంతోషముల్దండియై
కడు పుణ్యమ్ముల పంటయై జననికే గారంపు బంగారమై
ముడి పువ్వే నెమలీకయై యలరెనీ బుజ్జాయి శ్రీకృష్ణుడై.
- లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము.
13, సెప్టెంబర్ 2024, శుక్రవారం
మృత్తికతోడ
9, నవంబర్ 2022, బుధవారం
లయగ్రాహి
మాలి యొకడుండెనట, పూలతలఁబెంచెనట, మేలి విధ గంధములు గాలులను నిండెన్.
కేలఁగొని యల్లుకొని మాలలుగ కూర్చుకొని కాలినడ కోవెలకు మాలి చనె భక్తిన్.బాలలును పెద్దలును వేలుపుల పూజలనుఁ గోలములనాడిరట, చాల కనువిందుల్.
రాలినవి పూలచట తేలినవి వాగునల సోలినవి వాడినవి చాలునట జన్మల్.
23, జనవరి 2021, శనివారం
13, జనవరి 2021, బుధవారం
18, జూన్ 2020, గురువారం
ఒహో యాత్రికుడా!
27, నవంబర్ 2018, మంగళవారం
గీతం
గానం- డి వి మోహనకృష్ణ మరియు బృందం.
సంగీతం - కే సూర్యనారాయణ దీక్షితులు
ఆకాశవాణికి కృతజ్ఞతలు.
హరినారాయణ యని మనసారగా అననీయరా
కరివరదా నిను శరణాగతిగా కననీయరా ॥ హరి॥
సుఖసౌఖ్యమ్ముల సంతోషమ్ముల
నంతో ఇంతో గాంచితినయ్యా
కష్టమునోర్చి ఇష్టము విడచి
నిష్టూరమ్ముల నొచ్చితినయ్యా
నీకడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥హరి॥
విసిగితినయ్యా భవ బంధమ్ముల
వేసారితినీ యారు గుణమ్ముల
రోసితినయ్యా ఇహలోకమ్మున
నలిగితి నేనూ ఆశనిరాశల
నీ కడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥ హరి॥
----
సంవత్సరం క్రితం (ఋషిపీఠం పత్రికకు) వ్రాసిన పద్యాలు -
ఇందులో భావం గురించిన అజ్ఞానం మీద గురుకృప వలన కొంత కాంతి ప్రసరించింది. పద్యాల నడక గురించిన ఇష్టంతో ఇక్కడ పెడుతున్నాను. (సంస్కృతం లోని నయనపథగామీ అష్టకానికి స్వేచ్ఛాను వాదము)
మత్తకోకిల ఛందోరూపము-
1. నాదమా యమునానదీ తటి నల్లనల్లన మ్రోగగా,
నాదిలక్ష్మి, గణేశ, బ్రహ్మ, మహా శివాదులు మ్రొక్కగా,
స్వాదుమాధురి గోపిమోమున సాజరీతులఁ గ్రోలుచున్,
నాదు దృక్కుల నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!
2. వంశి, పింఛము, పట్టుదట్టియు, పాలనవ్వుల తోడుగా,
నంశుమంతులు వేలు కూడిన నబ్బురంపు ప్రకాశమున్,
సంశయమ్ములఁ దీర్చుచుండెడి చల్లనైన కటాక్ష మే
యంశమైనను నాకుఁజూపుమటందు, నీలపు మాధవా!
3. నీలపర్వత శ్రేణులందున, నీలి సంద్రపుతీరమున్,
చాల ప్రీతిని యన్నతోడ, నిజానుజాత సుభద్రతోన్,
మేలుకొల్పులు వేల్పులందరు మించు భక్తినిఁ బాడగా,
నేలుచుంటివి. దర్శనమ్మిడు నేడు, నీలపుమాధవా!
4. ఆ కృపార్ణవు, మేఘవర్ణుని నా సతీ కమలాక్షియున్,
నాకనాథుఁడు, శారదాసతి నమ్మి కీర్తనఁ జేయగా,
లోకబంధుగ నా శృతీస్మృతులొక్కటై నినుఁ గొల్వగా,
నాకు దిక్కుగ నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!
5. భూతలమ్మను స్యందనమ్మున పుణ్యవంతుల పంటగా
గీతనాట్యపు సంభ్రమమ్ముల కృష్ణభక్తుల వేడుకై
జోతలందుచు నేగుచుండెడి శోభఁ గాంచగ వేడుదున్,
నా తమింగని కానుపింపుము, నాథ! నీలపు మాధవా!
6.నీరజాక్షుఁడు, దివ్యతేజుఁడు, నీలికొండకు నేలికై,
కోరుకున్న లలామ రాధకు కొంగుబంగరు పోలికై,
కూరిమిన్ తననాదిశేషుఁడు కోరి మోయుచునుండగా,
దారి చూపెడి స్వామివందురు, దారు నీలపుమాధవా!
7.హాటకమ్ములు, సంపదల్ మరి యాధిపత్యముఁ బెండ్లియున్
మాటకైనను కోరనెప్పుడు. మా మహాశివుడర్చనల్
మాటిమాటికి చేయు స్వామివి, మాదు డెందము నిండ, నే
నాటికిన్ స్థిరవాసముండుము నాథ! నీలపుమాధవా!
8.సారహీనపు బంధనమ్ములు, చాల పాపపు మూటలున్
భారమైనవి. మోయజాలను పాపనాశ! భవాబ్ధినిన్
తారకమ్మయి కావరాగదె, దానవాంతక వేగమే!
జారకుండెడి భక్తినీయవె చాలు, నీలపుమాధవా!
ఈ సంబోధన ల వంటి నామరూపలింగభేదాలు వర్జ్యాలు.
ఈ విషయంలో దారిచూపగలిగిన వారు సూచనలివ్వగలరని ఆశిస్తాను.
9, సెప్టెంబర్ 2018, ఆదివారం
కందములు- సంచిక
సృష్టిలో ఉంటూ సృష్టి లయకు తోడ్పడేవి
పంచభూతాలు అని పెద్దలు చెప్తారు.
http://sanchika.com/kandamulu-pancha-bhootamulu/
18, ఏప్రిల్ 2018, బుధవారం
పది రూపాలకు మంగళమ్.
నీటిలో నొక చేప, నిక్కి చూసెడిదొక
కూర్మమ,దియె చూడు గొప్ప కిటియు,
గర్జించు సింహమ్ము, గరిమ గల వటువు,
విల్లు బట్టెడు వాఁడు, నల్ల చెలుఁడు,
హలము భుజమునున్న బలుఁడ,దొ పరశువు
బట్టిన వాని,దా పదనుఁ గనుము
తురగమ్ము నెక్కుచు తొందర నొచ్చెడు
కల్కి యొక్కడినిటఁ గాంచగలము.
వందనములు పలికి పద్మనాభునికిట
పలుకు పాట వోలె పాడుచుంటి
మంగళముల పాట బంగారు నోటనఁ
బలుకుచుంటి స్వామి పదము చేరి.
24, ఫిబ్రవరి 2018, శనివారం
అజచరిత్రములోని సరస్వతీ సంప్రార్థన
------
రాజృ = దీప్తౌ అని ధాత్వర్థం .స్వేన రాజన్త ఇతి స్వరాః. తమంతనే ప్రకాశించేవి కాబట్టి 'స్వరములు' అని పేరు. స్వతోరంజకములని అన్నాను. సాహిత్యము యొక్క ఊనిక లేకుండానే సంగీతంలో రాగధర్మానుసారం ఉచ్చరింపబడి, మనస్సును రంజింపజేసేవి కనుక కూడా స్వరములే.
సాహిత్యపరంగా అర్థం చెప్పినప్పుడు స్వృ ధాతువు నుంచి 'ఉచ్చరింపబడేవి' కనుక స్వరములు. వాటికి మరొక స్వరము యొక్క ఊనికతో నిమిత్తం లేనందువల్ల అవి అచ్చులని రూఢి ఏర్పడింది.