Loading...

15, జూన్ 2026, సోమవారం

వానచేవ

 పచ్చదనంపు పైడినిడు పావనతంతును శ్రద్ధమీరగా, 
నచ్చరమొప్ప సేయగలమంచు వనమ్ముల నెల్ల ధారగా 
చెచ్చెరఁ జేరు వర్షముల చేవఁ గనుంగొన సాధ్యమౌనొకో 
వెచ్చని మేడలందు సిరివెల్గుల నీల్గు  జనాళి బుద్ధికిన్?

--లక్ష్మీదేవి 
ఉత్పలమాల 

10, జూన్ 2026, బుధవారం

వర్షానందం

 

వర్షానందము కలుంగగ నదియే భాగ్యము, నంతః సం
ఘర్షాఘాతములఁ గూలిన తఱి సౌగంధిక తానై యా
కర్షింపంగఁ, జవి నూత్నపు పదునై కానగ, నిత్యమ్మై
హర్షమ్మందగ, మనోహరముగ, నాహ్లాదముఁ జేకూర్చున్. 
 
-- లక్ష్మీదేవి
వర్షానందము.
ఈ గణాలతో, వరుసతో ఏదైనా వృత్తముందో లేదో నాకు తెలియదు. ఇలా వ్రాయాలనిపించిందంతే.
మ న భ స భ మ గణములు, పదమూడో అక్షరము యతి.

ఎవరు దిక్కు?

 

చినుకులన్నిటిఁ జేర్చి చిత్రవల్లికఁ దీర్చి
   నీటిసంపదఁ గూర్చు నేత యెవరొ!
ననల సౌరుల నింపి నాకమ్ము నన తోపి
   వనసంపదలఁ గూర్చు ప్రభువదెవరొ!
తనివి తీరని తృష్ణ దరులఁ జేర్చని నావ
   కేల నుంచితి వంటు కీర్తులమర,
కనుల విందునుఁ జేసి మనుగడలనుఁ గాసి
   కనరాక నిలుచున్న కాంతుడెవరొ!
 
యెవ్వరెఱుగనట్టి యేకాంతలోకాల
నెక్కడుండునేమొ చిక్కకుండ
నివ్వరితృణమందు నిరతమ్ము కొలువుండు
చక్కనైన వాడె దిక్కు యెపుడు.
 
-- లక్ష్మీదేవి
సీసము 
ఆటవెలది

అయ్యా!

 

దూది మబ్బులు తెల్లగొడుగై
కొండగద్దియ పైనఁగొలువై
మనిషి చేతల వింతఁ గనుమయ్యా
నరసింగమయ్యా
మంచి చెడ్డల చింతనిడుమయ్యా!
౧}నేరమనక ఘోరమనక
కోరుకున్నది దక్కుదనుక
పరుగు తీతే బతుకు గురుతాయె
నరసింగమయ్యా
దొరకనంతనె వెతలు మొదలాయె
|| దూది||
కరుణఁగలిగి కట్టు నిలిచి
పరుల బతుకు విలువ నెఱిగి
సిరుల అర్థము లోతు తెలియంగా
నరసింగమయ్యా
ముందు కేగగ ఊతనిడుమయ్యా!
|| దూది||
పక్షులన్నీ పశువులన్నీ
నేర్పుతున్న పాఠమెఱిగి
భూమి తల్లినిఁ గాచుకొనంగా
నరులకేలా బుద్ధి రాదయ్యా!
నరసింగమయ్యా!!
చేయూత నొసగే దిక్కు నీవయ్యా!
|| దూది ||
--లక్ష్మీదేవి.

నీటితీగ

 నింగి నుంచి సాగెనొక్క నీటితీగ నేరుగా
భంగమంచు నేదిలేక పల్లముండు వైపుగా
రంగు చిక్కనయ్యె నేల  రమ్యమైన తోటయై,
పొంగులెత్తె సౌరభమ్ము పూల మించుచున్నదై.

 

- లక్ష్మీదేవి
ఉత్సాహము

పూలతీగెలు పైకి పాకుతాయి. కానీ ఇక్కడ నీటి తీగ స్వభావరీత్యా పల్లమున్న వైపుకు సాగి వచ్చింది. నేరుగా, ఏ ఆటంకమూ లేకుండా. తడిసిన రేగడినేలలు వివిధ రంగులు చిక్కగా పులుముకొని రంగు పువ్వులు పూసిన తోటలయినాయి. మట్టి పరిమళాలు పూల గంధాలను మించి పొంగులెత్తాయి.
 

29, ఏప్రిల్ 2026, బుధవారం

తొల్కారు వాన

 తొలికారోయన నెల్లెడంగురిసెనే తూకమ్ముగా వానలుం
బలు వైనమ్ముల జల్లె చిన్కులను నిర్వ్యాజమ్మునౌ ప్రేమతో,
లలినీరాడెను వృక్షముల్కుసుమ మాలాలంకృతుల్ దివ్యులై
పలువర్ణమ్ముల, మాధవాగమన కావ్యారంభసంరంభమై.

--లక్ష్మీదేవి

మత్తేభవిక్రీడితము

 

 

19, మార్చి 2026, గురువారం

సామ్రాట్టుకు స్వాగతమ్!

 జలజల రాలిన యాకుల
లలి మరపించుచు వినూత్న లావణ్యముతో
పలుపలు సొబగులఁ గూర్చుచు
వలువల తీరై మెరిసిన పత్రిం గనరే!

యాకుల మాటుగా మెరిసి, హ్లాదముఁ గూర్చెడు వన్నెచిన్నెల 
న్చీకటి రేయిలో విరియు చిన్ని సుమమ్ములఁ జూడ నేర్చిన,
న్చీకులు చింతలే పగిదిఁ జిత్తముఁ జేరును చెప్పవోయి, యీ 
లోకము సుందరమ్మనక లోపములేటికి యెంచనెంచితో!

 

తొలిరాగమ్ములఁ గమ్మగాఁ బలుకుచున్దొల్దొల్త నా కోకిలల్
తెలిరాగమ్ముల సాంద్రవర్ణముల దేదీప్యమ్ముగా పుష్పముల్
వలరాజొక్కడు మిత్రుడై చెలగునా వాసంతసామ్రాట్టుకై
యిలలో స్వాగత సత్కృతుల్ సలుపరే యింతింతకంతింతలై! 

16, మార్చి 2026, సోమవారం

ఆశ

ఆశలివేలనో మదిని యాతనవెట్టుచునిల్చునెందు, నా
కాశముఁ దాకగా పెరిగి కాయము వీడెడునంతదన్క నా
వేశము నంతకంతకును పెంచుచు జీవిని ముంచుచుండు నే
దేశము నున్న నైన నొక తీరుగ సాగును మానవాళికిన్.

 

-- లక్ష్మీదేవి
ఉత్పలమాల 

4, మార్చి 2026, బుధవారం

రంగులు

 మధువును నింపిన కలశము
సుధలనుఁ దొణికినఁ బగిదిని శోభస్కరమై
విధ విధ వర్ణములన్నియు
నిధులయి కురిసినవి నేడు నెత్తావులతో

27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

కన్యాకుమారి

 తరుణీ, కాఠిన్యవై నిత్యముఁ దపమునఁ దాదాత్మ్యవై నిల్చి యుండ,
న్సరి నీకెవ్వారు లేరంచనిన కథలలో సత్యముల్ గొప్పవమ్మా!
హరునేఁ గళ్యాణమున్ సేయగఁ దలచిన మాహాత్మ్యమేమందు, నీకై
వరుడున్ ధ్యానమ్ము నన్నిల్వగఁ దలచిన సౌభాగ్యమేమందు తల్లీ! 


🙏 కన్యాకుమారి 🙏


- లక్ష్మీదేవి.
మహాస్రగ్ధర వృత్తము


26, ఫిబ్రవరి 2026, గురువారం

వాదం

 వాదవివాదముల్పరగ భావరసస్ఫురణమ్ము నేర్పునే
సాదరమొప్పగా కవుల స్వాంతముఁదొల్కెడు భావవల్లరుల్,
వేదనఁదోడు స్పందనలు, ప్రేరణ నిచ్చెడు యోచనాదులన్
మోదము మీరఁ గైకొనగ ముచ్చటలాడిన నంత సుల్వొకో!


-లక్ష్మీదేవి 
ఉత్పలమాల 


24, ఫిబ్రవరి 2026, మంగళవారం

అంతే

 హాస్యమైన కవిత్వము నైనఁ గాని 
తెలిసికొన్నయంత మనము తేలికగును 
తెలియరాని చోటుల విప్పి తెలియజెప్ప 
బూనుటెల్ల చెవిటి, శంఖపు కథయగును 


- లక్ష్మీదేవి 
తేటగీతి


23, జనవరి 2026, శుక్రవారం

తల్లీ!

 తల్లీ! విద్యనొసంగి యధ్యయనమున్తాదాత్మ్యమున్నిండుగా
నుల్లమ్మందున నింపి నన్ను నిక నీవుద్ధారణన్జేయుమా!
ముల్లోకమ్ముల రక్షవై నిలిచి నిర్మోహమ్ము నెట్లుందువో
తల్లీ! నమ్మితి భారతీ! భగవతీ! త్రైగుణ్య విద్యానిధీ!

 

లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము